రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ నటుడు బాబీ దుర్మరణం
సినీ ఇండస్ట్రీలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ జబర్దస్త్ నటుడు లక్ష్మీ నారాయణ (28) అలియాస్ బాబీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. రాజమండ్రి రోడ్డు–కమ్–రైల్వే బ్రిడ్జిపై జరిగిన ప్రమాదంలో ఆయనతో పాటు మరో ఇద్దరు యువకులు కూడా ప్రాణాలు కోల్పోయారు.
బాబీ గతంలో మాజీ ఎంపీ హర్షకుమార్ వద్ద డ్రైవర్‌గా పనిచేశారు. అనంతరం శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటు జబర్దస్త్ షోలో ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొందారు. రాజమహేంద్రవరానికి చెందిన బాబీ స్కూటీపై కొవ్వూరు వైపు వెళ్తుండగా, ఎదురుగా వచ్చిన మరో ద్విచక్రవాహనంతో ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఈ ప్రమాదంలో బాబీ అక్కడికక్కడే మృతి చెందారు. హెల్మెట్ ధరించకపోవడమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని సమాచారం. అదే సమయంలో హెల్మెట్ ధరించిన మరో యువకుడు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు.
లక్ష్మీ నారాయణ మృతిపై పలువురు సినీ ప్రముఖులు, జబర్దస్త్ నటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నారు. ఈ ఘటన సినీ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

Post a Comment