ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు స్పాట్‌డెడ్, నలుగురికి తీవ్ర గాయాలు
ఆత్మకూర్: మేడారం సమ్మక్క–సారలమ్మ వనదేవతలను దర్శించుకుని తిరిగి వస్తున్న క్రమంలో ఆత్మకూర్ మండలం నీరుకుళ్ళ క్రాస్ రోడ్ వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఆత్మకూర్ సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలానికి చెందిన బోడ శేఖర్, బుర్ర శివ, దైత అనిల్, యామనగంటి వెంకన్న, జిల్లా ప్రవీణ్ తదితరులు ఆదివారం మేడారం జాతరకు వెళ్లారు. వనదేవతలను దర్శించుకుని సోమవారం స్వగ్రామానికి తిరిగి వస్తుండగా, నీరుకుళ్ళ క్రాస్ రోడ్ వద్ద రోడ్డు పక్కన నిలిపి ఉన్న టిప్పర్‌ను వారి వాహనం బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో వాహన డ్రైవర్ పక్కన కూర్చున్న బోడ శేఖర్ (28) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా, వారిని 108 అంబులెన్స్ ద్వారా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఆత్మకూర్ సీఐ సంతోష్, ఎస్సై తిరుపతి తెలిపారు.

Post a Comment