ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు చేపట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్

 

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు చేపట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, నిర్దిష్ట కాలపరిమితిలో పరిష్కరించే విధంగా వేగవంతమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, ఆర్డీవో మధు, గృహ నిర్మాణ శాఖాధికారి రవీంద్రనాథ్‌లతో కలిసి కలెక్టర్ ప్రజల వినతిపత్రాలను స్వయంగా స్వీకరించారు.

జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను లిఖితపూర్వకంగా సమర్పించారు. వాటిని శ్రద్ధగా విన్న కలెక్టర్, సంబంధిత శాఖల అధికారులకు వెంటనే ఎండార్స్ చేసి తక్షణ నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అర్హులైన వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ప్రజావాణిలో స్వీకరించిన పలు దరఖాస్తులను పరిశీలించిన కలెక్టర్, సంబంధిత అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రతి ఫిర్యాదుపై శాఖాధిపతులు వ్యక్తిగత పర్యవేక్షణ చేపట్టి పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని, పెండింగ్ లేకుండా నిర్ణీత గడువులో చర్యలు పూర్తి చేయాలని సూచించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా సమర్థవంతమైన పరిపాలన అందించడంలో అధికారులు కట్టుబడి ఉండాలని తెలిపారు.

ప్రజావాణిలో స్వీకరించిన కొన్ని ముఖ్య దరఖాస్తులు:

ఇల్లందు మండలం తిలక్‌నగర్ గ్రామపంచాయతీకి చెందిన ఎట్టి కౌసల్య తన వారసత్వ వ్యవసాయ భూమికి సంబంధించిన పాస్‌బుక్ మంజూరు చేయాలని కోరారు. దీనిపై కలెక్టర్ తగు చర్యల కోసం ధరణి ఆపరేటర్‌కు ఎండార్స్ చేశారు. దుమ్ముగూడెం మండలం బండారుగూడెం గ్రామానికి చెందిన కాటిబోయిన సూర్యకుమారి తన కుమార్తెకు సైనిక్ స్కూల్ ప్రవేశం కల్పించాలని కోరగా, సంబంధిత డి-సెక్షన్‌కు దరఖాస్తును పంపించారు.

ఇల్లందు మండలం రొంపేడు గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి (ఎం.ఏ., బి.ఎడ్) ఉద్యోగావకాశాల కోసం చేసిన వినతిని జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారికి పంపించారు. గుండాల మండలం కాచనపల్లి గ్రామానికి చెందిన రైతులు బోరు మరియు విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరగా, ఐటీడీఏ పీవోకు దరఖాస్తును ఎండార్స్ చేశారు.

మణుగూరు మండలం కొత్త మల్లేపల్లి గ్రామానికి చెందిన మామిడి నాగేశ్వరరావు ల్యాండ్ లూజర్ సర్టిఫికెట్ సమస్య పరిష్కరించాలనే వినతిని భద్రాచలం సబ్ కలెక్టర్‌కు పంపించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Blogger ఆధారితం.