కొత్తగూడెం: మెడికల్ బోర్డు నిర్వహణపై టీబీజీకేఎస్ ధర్నా
కొత్తగూడెం ఏరియాలో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీబీజీకేఎస్ (TBGKS) ఆధ్వర్యంలో జీఎం ఆఫీస్ ముందు భారీగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ, వైస్ ప్రెసిడెంట్ గడప రాజయ్య నేతృత్వంలో జీఎం శాలంరాజుకు వినతిపత్రం అందజేశారు.
ధర్నాలో నాయకులు పలువురు ముఖ్య డిమాండ్లను ఉంచారు. జూలై, నవంబర్ నెలల్లో అర్హత ఉన్నప్పటికీ అన్ఫిట్‌గా ప్రకటించబడని కార్మికులకు తిరిగి మెడికల్ బోర్డు నిర్వహించాలని డిమాండ్ చేశారు. విజిలెన్స్‌లో ఉన్న మారుపేరుల సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. అలాగే AITUC, INTUC సంఘాలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని స్పష్టం చేశారు.
గత ఏడాది నుంచి మెడికల్ బోర్డు కోసం ఎదురు చూస్తున్న రెండు వేలకుపైగా కార్మికులకు న్యాయం చేయాలని, సింగరేణి యాజమాన్యం కార్మిక వ్యతిరేక విధానాలను విరమించాలని హెచ్చరించారు. వీకే కోల్ మైన్‌లో సింగరేణి యంత్రాలు, ఉద్యోగులతోనే బొగ్గు తవ్వకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
కొత్తగూడెం ఏరియాలో సర్ప్లస్‌లో ఉన్న ఖాళీలను పీవీకే–5 అండర్‌గ్రౌండ్ కార్మికులతో పారదర్శకంగా, ఎలాంటి పైరవీలు లేకుండా భర్తీ చేయాలని కోరారు. జేవీఆర్‌ఓసీ (JVROC)లో డిప్యూటేషన్‌పై ఉన్న కార్మికులను వీకే కోల్ మైన్‌కు తిరిగి తీసుకురావాలని కూడా డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకులు కాపు కృష్ణ, గడప రాజయ్య, తుమ్మ శ్రీనివాస్, బోరింగ్ శంకర్, బురుగుల రవికుమార్, ఎంటెక్ మహేందర్, కంచర్ల శ్రీనివాస్, నెమల్ల వెంకటేశ్వర్లు తదితరులు, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

Post a Comment