గ్రామాల కఠిన నిర్ణయాలు… జిల్లాకు ఆదర్శంగా మారుతున్న ప్రజారోగ్య ఉద్యమం

గ్రామాల కఠిన నిర్ణయాలు… జిల్లాకు ఆదర్శంగా మారుతున్న ప్రజారోగ్య ఉద్యమం


కోరుట్ల: ఒక చిన్న గ్రామం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు మొత్తం జిల్లాకు మార్గదర్శకంగా నిలుస్తోంది. కోరుట్ల నియోజకవర్గంతో పాటు పలు గ్రామాల్లో ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు పంచాయతీలు కఠిన చర్యలు చేపడుతున్నాయి.

అనారోగ్యానికి దారి తీస్తున్న కారణాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, ప్లాస్టిక్ వినియోగం, గంజాయి విక్రయం, బహిరంగ మద్యపానం, ధూమపానం వంటి అంశాలపై నిషేధాలు విధిస్తున్నారు. గ్రామ స్థాయిలోనే నియంత్రణ చర్యలు తీసుకుంటూ ప్రజల్లో అవగాహన పెంచుతున్నారు.

సంగెం గ్రామం – ప్లాస్టిక్‌కు పూర్తి నిషేధం

సంగెం గ్రామంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.5,000 వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఆలయాలు, శుభకార్యాల్లో ప్లాస్టిక్ బదులు స్టీల్ పాత్రలు, ఆకుల పళ్లెల వినియోగాన్ని తప్పనిసరి చేశారు.

కథలాపూర్ మండలం – గంజాయి విక్రయాలపై కఠిన చర్యలు

కథలాపూర్ మండలంలో గంజాయి విక్రయాలపై గ్రామ పంచాయతీలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. గంజాయి అమ్మిన వారిపై రూ.20,000 జరిమానా విధించడంతో పాటు సమాచారం అందించిన వారికి రూ.5,000 బహుమతి ప్రకటించారు.

అయిలాపూర్ గ్రామం – బహిరంగ అలవాట్లపై నిషేధం

అయిలాపూర్ గ్రామంలో బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం, ధూమపానం, మల విసర్జనపై పూర్తిగా నిషేధం విధించారు. ప్రజలు తిరిగే ప్రదేశాల్లో ప్లాస్టిక్, గాజు సీసాలు పారేయకుండా కఠిన ఆదేశాలు జారీ చేశారు.

ఐస్క్రీమ్ బండ్లకు నో ఎంట్రీ

కొన్ని గ్రామాల్లో కల్తీ ఆహారం కారణంగా పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారని గుర్తించి ఐస్క్రీమ్ బండ్లకు కూడా నో ఎంట్రీ చెప్పారు.


స్పష్టమైన సందేశం

ఆరోగ్యకరమైన గ్రామ సమాజం కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ గ్రామాలు చాటి చెబుతున్నాయి. ప్రజల సహకారంతో అమలు చేస్తున్న ఈ చర్యలు ఇప్పుడు జిల్లాకు ఆదర్శంగా నిలుస్తున్నాయి.

Blogger ఆధారితం.