శంషాబాద్ ఎయిర్‌పోర్టులో హైడ్రోపోనిక్ గంజాయి పట్టివేత

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో హైడ్రోపోనిక్ గంజాయి పట్టివేత


హైదరాబాద్, ఏప్రిల్ 17: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (శంషాబాద్) కేంద్రంగా కొనసాగుతున్న అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠాలపై కస్టమ్స్ అధికారులు కీలక చర్యలు తీసుకున్నారు. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ మహిళ ప్రయాణికురాలి వద్ద నుంచి సుమారు మూడు కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

శుక్రవారం తెల్లవారుజామున థాయ్ ఎయిర్‌వేస్ విమానంలో హైదరాబాద్‌కు చేరుకున్న ఆ మహిళ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో కస్టమ్స్ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తనిఖీల్లో బ్యాగేజీలో నిషేధిత డ్రగ్స్ దాచినట్లు బయటపడింది.

అధికారుల ప్రకారం స్వాధీనం చేసుకున్నది సాధారణ గంజాయి కాదని, అధిక మత్తు ప్రభావం కలిగించే హైడ్రోపోనిక్ గంజాయిగా గుర్తించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో దీనికి భారీ డిమాండ్ మరియు ధర ఉన్నట్లు తెలిపారు.

పట్టుబడిన మహిళను అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్నారు. ఆమె కేవలం కొరియర్‌గా పనిచేస్తుందా? లేక అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాతో సంబంధాలున్నాయా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇటీవల బ్యాంకాక్, దుబాయ్ వంటి ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ అక్రమ రవాణా పెరుగుతున్న నేపథ్యంలో, శంషాబాద్ విమానాశ్రయంలో నిఘాను మరింత కట్టుదిట్టం చేసినట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.

Blogger ఆధారితం.