ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్

 

ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. మంగళవారం తహసీల్దారులు, ఎంపీడీవోలు, ఏటీఎంలు మరియు సంబంధిత శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా సుమారు 83,635 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం నిర్ధేశించుకున్నట్లు తెలిపారు. ఈ లక్ష్య సాధన కోసం 168 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే జిల్లాలో 56 కేంద్రాలకు ధాన్యం చేరినట్లు, ముఖ్యంగా ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి ప్రాంతాల్లో అధికంగా రాకపోకలు ఉన్నట్లు తెలిపారు. వ్యవసాయ శాఖ ద్వారా ధాన్యం గ్రేడింగ్ ప్రక్రియ సక్రమంగా కొనసాగుతోందని చెప్పారు.

రైస్ మిల్లర్ల నుండి ప్రభుత్వ నిబంధనల ప్రకారం బ్యాంక్ గ్యారంటీలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, టెంట్లు, తాగునీరు, విద్యుత్, టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్లు, తూకం యంత్రాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

అలాగే, నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం కొనుగోళ్లు పకడ్బందీగా నిర్వహించాలన్నారు. కూలీలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారానే విక్రయించాలని పిలుపునిచ్చారు. ధాన్యాన్ని తాలు, తడి లేకుండా శుభ్రంగా తీసుకురావాలని తెలిపారు.

కొనుగోలు కేంద్రాల ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను వేగవంతం చేసి, మిల్లుల కేటాయింపులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

Blogger ఆధారితం.