కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా – బూర్గంపహాడ్ ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న 99 రోజుల కార్యాచరణలో సంక్షేమ వారాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ అంకిత్ IAS బూర్గంపహాడ్‌లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందుతున్న సదుపాయాలు, విద్యా కార్యక్రమాల అమలు తీరును సమగ్రంగా పరిశీలించారు.
పాఠశాలలో నిర్వహిస్తున్న టాలెంట్ టెస్ట్, డ్రాయింగ్ పోటీలను పరిశీలించిన కలెక్టర్ విద్యార్థుల ప్రతిభను అభినందించారు. ఇటువంటి సృజనాత్మక కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని పేర్కొంటూ, మరింత విస్తృతంగా నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
అనంతరం 8వ, 9వ తరగతి విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి వసతి, భోజనం, పాఠ్యపుస్తకాలు తదితర సదుపాయాలపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు సమర్థవంతంగా అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
కిచెన్ షెడ్‌ను పరిశీలించిన కలెక్టర్ ఆహార నాణ్యతను తనిఖీ చేసి, మెనూ ప్రకారం పోషకాహారంతో కూడిన భోజనం అందించాలని సూచించారు. తాజా కూరగాయల వినియోగం, ఆహార తయారీ నుండి వడ్డింపు వరకు పరిశుభ్రత పాటించడం తప్పనిసరి అని స్పష్టం చేశారు.
పాఠశాల పరిసరాల పరిశుభ్రత, తరగతి గదుల నిర్వహణ, తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయాలపై కూడా ఆరా తీశారు. విద్యార్థులకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు.
విద్యార్థుల హాజరు, విద్యా ప్రగతి, బోధనా విధానాలపై సమగ్రంగా సమీక్షించిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS, విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు.

Post a Comment