కేరళ ప్రభుత్వంపై సీఎం రేవంత్ వ్యాఖ్యలు సరికాదు: సిపిఐ జిల్లా కార్యదర్శి జలాలోద్దీన్
సదాశివపేట, ఏప్రిల్ 9: కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి Revanth Reddy చేసిన వ్యాఖ్యలు అనుచితమని సిపిఐ జిల్లా కార్యదర్శి సయ్యద్ జలాలోద్దీన్ విమర్శించారు. కేరళ ముఖ్యమంత్రి Pinarayi Vijayanపై చేసిన ఆరోపణలు సమంజసం కావని ఆయన పేర్కొన్నారు.
గురువారం సదాశివపేటలో నిర్వహించిన “ఇంటింటికి సిపిఐ” కార్యక్రమంలో పాల్గొన్న జలాలోద్దీన్ మాట్లాడుతూ, అంతర్జాతీయ పరిస్థితులు, ముఖ్యంగా అమెరికా యుద్ధ విధానాలపై భారత ప్రధానమంత్రి Narendra Modi స్పందించకపోవడం ఎందుకని ప్రశ్నించారు. గ్యాస్, పెట్రోల్ ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు.
కేరళ సీఎంను పదేపదే విమర్శించడం తగదని, ఎన్నికల ప్రచారం కోసం కేరళ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో అమలు చేసిన హామీలను ప్రజలకు వివరించాలని సూచించారు. తెలంగాణలో ఇచ్చిన హామీలలో ఎన్ని అమలు అయ్యాయో ప్రజలకు తెలియజేయాలన్నారు.
కేరళ ప్రభుత్వం దారిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలను అభివృద్ధి దిశగా తీసుకువచ్చిందని, అక్కడ నూటికి నూరు శాతం అక్షరాస్యత సాధించడంతో పాటు డిగ్రీ వరకు ఉచిత విద్య అందిస్తున్నారని చెప్పారు. తెలంగాణలో ఇలాంటి ఉచిత విద్య ఎక్కడ అందుతున్నదో ప్రభుత్వం చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి రెహమాన్, నాయకులు తాజోద్దీన్, షఫీ అహ్మద్, శంకరప్ప, పాండు, ముస్తఫా, బుజ్జమ్మ, రమేష్, గంగమ్మ, పూలమ్మ, బిపాషా, కళావతి, సాధిక్ అలీ, టాస్లీమా, గౌస్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment