ఆవాస విద్యాలయాల తనిఖీలో లోపాలపై ఆగ్రహం – ఎంఈఓకు షోకాజ్ నోటీస్ జారీకి కలెక్టర్ ఆదేశం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాతకొత్తగూడెంలో ఉన్న సమగ్ర శిక్ష పరిధిలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆవాస విద్యాలయం మరియు పట్టణ బాలుర ఆవాస విద్యాలయం (URS)లను గురువారం జిల్లా కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఏడవ తరగతి గదిని సందర్శించి విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడారు. వారికి అందుతున్న సౌకర్యాలు, భోజనం, ఆహార నాణ్యతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థుల ఇంగ్లీష్ పఠన సామర్థ్యాన్ని పరీక్షించిన కలెక్టర్, వారి ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
విద్యార్థులు సరిగా చదవలేకపోవడానికి గల కారణాలపై ప్రిన్సిపాల్‌ను ప్రశ్నించిన కలెక్టర్, బోధనలో లోపాలపై వివరణ కోరారు. పట్టణ స్థాయి పాఠశాల అయినప్పటికీ విద్యార్థుల సామర్థ్యం తక్కువగా ఉండటం ఆందోళనకరమని తెలిపారు.
స్టోర్‌రూమ్‌ను పరిశీలించిన కలెక్టర్, అవసరమైన సరుకులు తగినంతగా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సరఫరాలో లోపాలపై సంబంధిత అధికారులను ప్రశ్నించారు. అనంతరం కిచెన్‌ను తనిఖీ చేసి పరిశుభ్రత లోపాన్ని గమనించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు అందించే ఆహారం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోదని హెచ్చరించారు.
ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను పరిశీలించిన కలెక్టర్, అందరూ కాంట్రాక్టు పద్ధతిలోనే విధులు నిర్వహిస్తున్నట్లు గమనించారు. ఈ పరిస్థితుల్లో కూడా విద్యార్థుల అభ్యాసంపై ప్రభావం పడకుండా బాధ్యతతో పని చేయాలని సూచించారు.
ఈ పాఠశాలలో వీధి బాలలు, రక్షించబడిన బాలలు, డ్రాప్ అవుట్ బాలలు చదువుతున్నందున వారికి ప్రత్యేక శ్రద్ధ అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు. అయితే పర్యవేక్షణలో లోపం స్పష్టంగా కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో సంబంధిత ఎంఈఓకు షోకాజ్ నోటీస్ జారీ చేయాలని అధికారులకు కలెక్టర్ అంకిత్ ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల నిర్వహణ, బోధన ప్రమాణాలు, విద్యార్థుల సంక్షేమంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీలో కలెక్టర్ వెంట పాఠశాల ప్రిన్సిపల్ రాంబాయి, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment