భద్రగిరి మార్ట్‌కు విశేష ఆదరణ : ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్, మే 12, 2026: ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తులు, జీసీసీ ద్వారా సేకరించిన అటవీ ఉత్పత్తులు, గిరిజనులు మరియు మహిళా సంఘాల తయారీ వస్తువులకు మార్కెట్ కల్పించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన “భద్రగిరి మార్ట్” ప్రజల నుండి విశేష ఆదరణ పొందుతోందని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ తెలిపారు.
సోమవారం సాయంత్రం సుజాతనగర్ మండలానికి చెందిన రైతు ఎల్లయ్య ఎద్దుగానుగతో తయారుచేస్తున్న కల్తీ లేని నూనె తయారీ విధానాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దర్శనానికి దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులను ఆకర్షించే విధంగా భద్రగిరి మార్ట్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు.
భద్రగిరి మార్ట్‌లో ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తులు, అడవుల నుంచి సేకరించిన అటవీ ఉత్పత్తులు, గిరిజన మహిళలు తయారు చేస్తున్న “మిల్లెట్ మ్యాజిక్” బిస్కెట్లు, వివిధ రకాల పచ్చళ్ళు, నెయ్యి, తేనెతో పాటు ఎద్దుగానుగ నూనె వంటి కల్తీ లేని నిత్యావసర సరుకులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. నాణ్యమైన వస్తువులకు ప్రజల్లో మంచి డిమాండ్ పెరుగుతోందని, అందువల్ల భద్రగిరి మార్ట్‌కు ఆదరణ రోజురోజుకు పెరుగుతోందని చెప్పారు.
భద్రగిరి మార్ట్‌కు సరఫరా అయ్యే నిత్యావసర సరుకులను ప్రతి మూడు నెలలకు ఒకసారి ఐటీడీఏ నియమించిన ప్రత్యేక బృందాలు గ్రామాలకు వెళ్లి పరిశీలిస్తున్నాయని తెలిపారు. నాణ్యత ప్రమాణాలు పాటించిన ఉత్పత్తులనే సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, పరీక్షల్లో కల్తీ తేలితే సంబంధిత సరఫరాదారులను వెంటనే తొలగిస్తామని హెచ్చరించారు.
ప్రస్తుతం రైతు ఎల్లయ్య సరఫరా చేస్తున్న ఎద్దుగానుగ నూనెకు మంచి డిమాండ్ ఉందని, ఇదే విధంగా ఎటువంటి కల్తీ లేకుండా నాణ్యమైన ఉత్పత్తులను అందించాలని రైతుకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణ ప్రసాద్, రైతు ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Post a Comment