మిర్చి గ్రేడింగ్ కేంద్రాల్లో బాల కార్మికులు.. ముగ్గురు యజమానులపై కేసులు నమోదు
మిర్చి గ్రేడింగ్ కేంద్రాల్లో బాల కార్మికులు.. ముగ్గురు యజమానులపై కేసులు నమోదు
గుంటూరు, జూన్ 13: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కార్మిక శాఖ, ఫ్యాక్టరీల విభాగం, చైల్డ్ లైన్ విభాగం సంయుక్తంగా శనివారం గుంటూరు మిర్చి యార్డు పరిధిలోని పలు మిర్చి గ్రేడింగ్ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి.
ఈ తనిఖీల సందర్భంగా మొత్తం ఆరుగురు బాల కార్మికులను గుర్తించిన అధికారులు, వారిని వెంటనే ఆ పనుల నుంచి తప్పించి తిరిగి పాఠశాలలకు వెళ్లేలా అవసరమైన చర్యలు చేపట్టారు. బాల కార్మికులను పనిలో పెట్టుకున్న ముగ్గురు యజమానులపై చట్టపరమైన కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో ప్రజల సహకారం ఎంతో అవసరమని అధికారులు పేర్కొన్నారు. ఎక్కడైనా బాల కార్మికులను గుర్తించినట్లయితే వెంటనే 1098 (చైల్డ్ హెల్ప్‌లైన్) లేదా 9492555157 నంబర్లకు సమాచారం అందించాలని సూచించారు.
ఈ తనిఖీల్లో డిప్యూటీ లేబర్ కమిషనర్ గాయత్రి దేవి, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వాసంతి, చైల్డ్ లైన్ విభాగం అధికారులు మరియు ఇతర సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.
అధికారులు మాట్లాడుతూ, బాల కార్మికులను పనుల్లో నిమగ్నం చేయడం చట్టవిరుద్ధమని, ఇటువంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పిల్లల విద్య, సంక్షేమం మరియు వారి భవిష్యత్తు పరిరక్షణ కోసం సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.

Post a Comment