ఆసుపత్రికి గర్భిణిగా వెళ్లిన మహిళా కానిస్టేబుల్.. కట్ చేస్తే వెలుగులోకి సంచలన నిజాలు!
ఆసుపత్రికి గర్భిణిగా వెళ్లిన మహిళా కానిస్టేబుల్.. కట్ చేస్తే వెలుగులోకి సంచలన నిజాలు!
హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురం ప్రాంతంలో అక్రమంగా గర్భంలోని శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు డికాయ్ ఆపరేషన్ ద్వారా బట్టబయలు చేశారు. ఈ వ్యవహారంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రి డైరెక్టర్, రిసెప్షనిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్‌ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.
పోలీసులకు వనస్థలిపురంలోని హయగ్రీవ హాస్పిటల్‌లో గర్భిణులకు చట్టవిరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో అధికారులు పక్కా ప్రణాళికతో డికాయ్ ఆపరేషన్ చేపట్టారు. ఇందులో భాగంగా ఓ మహిళా కానిస్టేబుల్‌ను గర్భిణిగా పంపించి నిందితుల కార్యకలాపాలపై నిఘా పెట్టారు.
దర్యాప్తులో హాస్పిటల్ డైరెక్టర్ కొర్ర రాజు, రిసెప్షనిస్ట్ లోకేష్ గర్భంలోని శిశువు లింగాన్ని తెలుసుకునేందుకు ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం తుక్కుగూడలోని ఓ వ్యక్తి ద్వారా స్కానింగ్ నిర్వహించి, పుట్టబోయే శిశువు ఆడా మగా అనే విషయాన్ని వెల్లడిస్తున్నట్లు డికాయ్ ఆపరేషన్‌లో తేలింది.
ఈ సమాచారం ఆధారంగా పోలీసులు తుక్కుగూడలోని శ్రీ సాయి ధనుష్ క్లినిక్‌పై దాడులు నిర్వహించారు. అక్కడ ల్యాబ్ టెక్నీషియన్ విజయ్ కుమార్ అక్రమ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం హయగ్రీవ హాస్పిటల్ డైరెక్టర్ కొర్ర రాజు, రిసెప్షనిస్ట్ లోకేష్, ల్యాబ్ టెక్నీషియన్ విజయ్ కుమార్‌లను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఈ రాకెట్ వెనుక మరెవరైనా ఉన్నారా? గతంలో ఇలాంటి ఎన్ని కేసుల్లో వీరి ప్రమేయం ఉందనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు.
PCPNDT చట్టం కింద కేసులు
గర్భంలోని శిశువు లింగాన్ని నిర్ధారించడం, ఆ సమాచారాన్ని వెల్లడించడం భారతదేశంలో చట్టవిరుద్ధం. ఈ నేపథ్యంలో నిందితులపై Pre-Conception and Pre-Natal Diagnostic Techniques (PCPNDT) Act కింద కేసులు నమోదు చేశారు. ఈ చట్టాన్ని ఉల్లంఘించే ఆసుపత్రులు, స్కానింగ్ కేంద్రాలు, వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఆడపిల్లలపై వివక్షను అరికట్టాలి
ఆడపిల్లలపై వివక్షను నిర్మూలించేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అధికారులు సూచించారు. ఎక్కడైనా అక్రమ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. ఇటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టడంలో ప్రజల సహకారం ఎంతో అవసరమని పోలీసులు స్పష్టం చేశారు.

Post a Comment