ఫారెస్ట్–రెవెన్యూ జాయింట్ సర్వే, భూసేకరణ ప్రక్రియలను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్

ఫారెస్ట్–రెవెన్యూ జాయింట్ సర్వే, భూసేకరణ ప్రక్రియలను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్
 ఫారెస్ట్–రెవెన్యూ జాయింట్ సర్వే, భూసేకరణ ప్రక్రియలను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్

అక్కినేపల్లి, లింగంపల్లి ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించిన కలెక్టర్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో కొనసాగుతున్న ఫారెస్ట్–రెవెన్యూ జాయింట్ సర్వే, నాన్-క్యాడస్ట్రల్ సర్వే మరియు నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం మండలంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు.

మొదటగా అక్కినేపల్లి గ్రామంలో చేపడుతున్న నాన్-క్యాడస్ట్రల్ సర్వే పనులను పరిశీలించిన కలెక్టర్, భూముల హద్దుల గుర్తింపు, సర్వే ప్రక్రియ, రికార్డుల నమోదు విధానాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సర్వే పనులను నాణ్యత ప్రమాణాలతో, పారదర్శకంగా నిర్వహించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

అనంతరం లింగంపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 1458లో కొనసాగుతున్న ఫారెస్ట్–రెవెన్యూ జాయింట్ సర్వే పనులను కలెక్టర్ పరిశీలించారు. అటవీ మరియు రెవెన్యూ శాఖల అధికారులు సంయుక్తంగా నిర్వహిస్తున్న సర్వేలో భూముల సరిహద్దుల నిర్ధారణ ఖచ్చితంగా జరగాలని ఆదేశించారు. శాఖల మధ్య సమన్వయంతో పనిచేసి సర్వే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా అధికారులు కలెక్టర్‌కు వివరాలు అందిస్తూ అక్కినేపల్లి గ్రామ పరిధిలో సుమారు 4,400 ఎకరాల విస్తీర్ణంలో ఫారెస్ట్–రెవెన్యూ జాయింట్ సర్వే పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం పనులు ప్రణాళికాబద్ధంగా సాగుతున్నాయని, మరో రెండు నెలల్లో సర్వే ప్రక్రియను పూర్తిచేయనున్నట్లు వెల్లడించారు.

తదుపరి దమ్మపేట తహసీల్దార్ కార్యాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమైన కలెక్టర్, సీతారామ ప్రాజెక్టు అలైన్‌మెంట్‌ను మ్యాప్ ద్వారా పరిశీలించారు. ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ, సర్వే, సరిహద్దుల నిర్ధారణ అంశాలపై సమగ్రంగా చర్చించారు. ప్రాజెక్టు పనులకు ఎటువంటి ఆటంకాలు తలెత్తకుండా సంబంధిత శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని, పెండింగ్ అంశాలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.

ఫారెస్ట్–రెవెన్యూ జాయింట్ సర్వే ద్వారా అటవీ, రెవెన్యూ భూముల సరిహద్దులు స్పష్టంగా నిర్ధారణ కావడంతో పాటు భవిష్యత్తులో తలెత్తే భూవివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ అంకిత్ పేర్కొన్నారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా సర్వే, భూసేకరణ ప్రక్రియలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో కొత్తగూడెం రెవెన్యూ డివిజనల్ అధికారి మధు, దమ్మపేట తహసీల్దార్ రామ్ నరేష్, ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్ రావు, సర్వేయర్ నాగరాజు, రైతులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.