కామమోహంలో కన్నబిడ్డను బలి చేసిన తల్లి.. ప్రియుడితో ఏకాంతంగా ఉన్న వేళ ఏడ్చాడని హత్య

కామమోహంలో కన్నబిడ్డను బలి చేసిన తల్లి.. ప్రియుడితో ఏకాంతంగా ఉన్న వేళ ఏడ్చాడని హత్య
 కామమోహంలో కన్నబిడ్డను బలి చేసిన తల్లి.. ప్రియుడితో ఏకాంతంగా ఉన్న వేళ ఏడ్చాడని హత్య

మానవత్వానికే మచ్చ తెచ్చే దారుణ ఘటన మేడ్చల్ జిల్లాలో వెలుగుచూసింది. కన్నతల్లి ప్రేమను మరచి, కామమోహంలో కళ్లు మూసుకుపోయిన ఓ మహిళ తన రెండేళ్ల కుమారుడి ప్రాణాలు తీసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ప్రియుడితో ఏకాంతంగా ఉన్న సమయంలో చిన్నారి ఏడవడంతో అతడిని అడ్డుగా భావించి హత్య చేసిన ఈ అమానుష ఘటన ఇరవై రోజుల తర్వాత బయటపడింది.

పోలీసుల వివరాల ప్రకారం, సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం తీగుల్ గ్రామానికి చెందిన స్వామి, జ్యోతి దంపతులు ప్రస్తుతం మేడ్చల్ జిల్లా కీసరలో నివాసం ఉంటున్నారు. స్వామి క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి నాలుగేళ్ల కుమార్తె, రెండేళ్ల కుమారుడు హరికృష్ణ ఉన్నారు.

జ్యోతికి పెళ్లికి ముందే యాదాద్రి భువనగిరి జిల్లా మాదాపూర్ గ్రామానికి చెందిన నవీన్‌తో పరిచయం ఉండేదని, వివాహం అనంతరం కూడా ఆ పరిచయం వివాహేతర సంబంధంగా కొనసాగిందని పోలీసులు వెల్లడించారు. భర్త ఉద్యోగానికి వెళ్లిన సమయంలో నవీన్ తరచూ జ్యోతి ఇంటికి వచ్చేవాడని విచారణలో తేలింది.

గత నెల 29న స్వామి విధులకు వెళ్లిన అనంతరం నవీన్ జ్యోతి ఇంటికి వచ్చాడు. ఇద్దరూ ఇంట్లో ఏకాంతంగా ఉన్న సమయంలో రెండేళ్ల హరికృష్ణ గట్టిగా ఏడవడం ప్రారంభించాడు. దీంతో కోపోద్రిక్తుడైన నవీన్, చిన్నారి తమకు అడ్డుగా ఉన్నాడని చెప్పగా, జ్యోతి కూడా అతని మాటకు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఇద్దరూ కలిసి చిన్నారి కాళ్లు పట్టుకుని గాల్లోకి ఎత్తి నేలపై బలంగా కొట్టినట్లు విచారణలో వెల్లడైంది. తలకు తీవ్ర గాయాలు కావడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.

హత్య అనంతరం జ్యోతి ఏమీ తెలియనట్లు నటించింది. తన కుమారుడు ఫిట్స్ రావడంతో చనిపోయాడని భర్త స్వామిని నమ్మించింది. అనంతరం చిన్నారి మృతదేహాన్ని స్వగ్రామమైన తీగుల్‌కు తీసుకెళ్లి కుటుంబ సభ్యులతో కలిసి అంత్యక్రియలు నిర్వహించారు.

అయితే గత కొన్ని రోజులుగా భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన స్వామి, బంధువుల సమక్షంలో జ్యోతిని ప్రశ్నించాడు. ఈ సందర్భంగా ఆమె జరిగిన విషయాన్ని ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. వెంటనే స్వామి కీసర పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.

ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తీగుల్ గ్రామంలో ఖననం చేసిన చిన్నారి మృతదేహాన్ని వెలికితీసి, మేజిస్ట్రేట్ సమక్షంలో రీ-పోస్టుమార్టం నిర్వహించారు. నిందితురాలు జ్యోతిని అరెస్ట్ చేసిన పోలీసులు, పరారీలో ఉన్న నవీన్ కోసం ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు.

ఇరవై రోజుల తర్వాత వెలుగులోకి వచ్చిన ఈ హృదయ విదారక ఘటన స్థానికంగా తీవ్ర ఆవేదనకు గురిచేసింది. అమాయక చిన్నారి ప్రాణాలను బలితీసుకున్న నిందితులకు కఠిన శిక్ష విధించాలని స్థానికులు, చిన్నారి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు అన్ని కోణాల్లో కేసును విచారిస్తున్నారు.

Blogger ఆధారితం.