11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్లు కేటాయించాలని కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్లు కేటాయించాలని కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
న్యూఢిల్లీ: తెలంగాణకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ (PMAY-G) పథకం కింద 11.56 లక్షల ఇళ్లను కేటాయించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు ఎంపీలతో కలిసి కృషి భవన్‌లో కేంద్ర మంత్రిని కలిసిన సీఎం, రాష్ట్రంలో పేదలకు గృహనిర్మాణానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని వివరించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదలకు సొంత ఇళ్లు నిర్మించి ఇవ్వాలని లక్ష్యంగా పనిచేస్తున్నామని సీఎం తెలిపారు. గత ప్రభుత్వం పీఎంఏవై-జీ పథకాన్ని సమర్థవంతంగా వినియోగించుకోకపోవడంతో గత పదేళ్లుగా గ్రామీణ పేదలు ఇళ్ల కోసం ఎదురుచూడాల్సి వచ్చిందని, ప్రస్తుతం గృహాలపై భారీ డిమాండ్ నెలకొన్నట్లు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఆవాస్ ప్లస్ (Awaas+) యాప్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో 11,56,915 అర్హులైన గ్రామీణ కుటుంబాలను గుర్తించినట్లు సీఎం వివరించారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు వీలైనంత త్వరగా పీఎంఏవై-జీ కింద ఇళ్లను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా, ఎల్‌నినో ప్రభావం, తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా గ్రామీణ ప్రజలకు ఉపాధి అవకాశాలు తగ్గాయని పేర్కొంటూ, వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (వీబీజీ రామ్‌జీ) పరిధిలో అదనపు పనులను చేర్చాలని కోరారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులు, రైతు కూలీల జీవనోపాధి మెరుగుపడేలా పంటల వైవిధ్యీకరణకు సంబంధించిన పనులకు అవకాశం కల్పించాలని సూచించారు.
రైతులు తమ భూముల్లో కూరగాయల పందిళ్లు, పశుగ్రాస ప్లాట్ల అభివృద్ధి, మల్బరీ సాగు, పట్టు పురుగుల పెంపకం షెడ్లు, ఇంటి వద్ద కూరగాయల తోటలు, వెదురు వనాల పెంపకం వంటి పనులను కూడా ఈ పథకంలో చేర్చాలని సీఎం కోరారు. అలాగే కొండ ప్రాంతాల్లో నీటి నిల్వ కందకాలు, ప్లాంటేషన్లలో తేమ సంరక్షణ పనులు, వరదలు మరియు ఇసుక మేటల వల్ల దెబ్బతిన్న భూముల పునరుద్ధరణకు అవసరమైన పనులను కూడా అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.
ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద గతంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నిర్మాణ సమయంలో 90 రోజుల ఉపాధి కల్పించే అవకాశం ఉండేదని గుర్తుచేసిన సీఎం, అదే విధానాన్ని వీబీజీ రామ్‌జీ కింద కూడా కొనసాగించాలని కోరారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించే ఇతర పనులను కూడా ఈ పథకంలో చేర్చేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర మంత్రిని అభ్యర్థించారు.
ఈ సమావేశంలో ఎంపీలు ఎం. అనిల్ కుమార్ యాదవ్, వేమ్ నరేందర్ రెడ్డి, డాక్టర్ మల్లు రవి, పోరిక బలరాం నాయక్, సురేష్ షేట్కార్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రామసహాయం రఘురాం రెడ్డి, గడ్డం వంశీకృష్ణతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Post a Comment