భారీ వర్షాలపై హైఅలర్ట్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ అంకిత్

 

భారీ వర్షాలపై హైఅలర్ట్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ అంకిత్

భారీ వర్షాలపై హైఅలర్ట్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ అంకిత్

రానున్న 36 గంటల్లో భారీ వర్షాల అవకాశం.. అన్ని శాఖల అధికారులు కార్యస్థానాల్లో అందుబాటులో ఉండాలని ఆదేశం

జిల్లాలో రానున్న 36 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సూచించారు. భారీ వర్షాల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఈ మేరకు బుధవారం సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ అంకిత్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అత్యవసర చర్యలపై అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

భారీ వర్షాల హెచ్చరికల దృష్ట్యా అన్ని శాఖల అధికారులు తమ కార్యస్థానాల్లో తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని, విధి నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించకుండా పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

వరద ముంపునకు గురయ్యే ప్రాంతాలను ముందుగానే గుర్తించి అక్కడి ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు అవసరమైతే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నదులు, వాగులు, కాలువలు, చెరువుల వద్దకు వెళ్లకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని, ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిని దాటేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నించవద్దని హెచ్చరించారు. అలాగే రహదారులు, కల్వర్టులపై నీరు ప్రవహిస్తున్న ప్రాంతాల్లో ప్రజలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.

భారీ వర్షాల కారణంగా తాగునీరు కలుషితమయ్యే అవకాశమున్నందున సురక్షిత తాగునీటి సరఫరా కోసం తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.

వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు వర్షాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందించాలని కలెక్టర్ తెలిపారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిన సందర్భాల్లో ఆసుపత్రుల్లో వైద్య సేవలకు ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. ప్రసవ సమయం సమీపించిన గర్భిణీలను ముందుగానే సమీప ఆసుపత్రులు లేదా గర్భిణీ వసతి కేంద్రాలకు తరలించి అవసరమైన వైద్య సేవలు అందేలా చూడాలని సూచించారు.

భారీ వర్షాల సమయంలో అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణకు ప్రాధాన్యతనిస్తూ ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ స్పష్టం చేశారు.

Blogger ఆధారితం.