ఫారెస్ట్ అధికారి ఇంట్లో రూ.26 లక్షల చోరీ.. మాజీ జడ్పీటీసీ సభ్యురాలి భర్తపై అనుమానం
ఫారెస్ట్ అధికారి ఇంట్లో రూ.26 లక్షల చోరీ.. మాజీ జడ్పీటీసీ సభ్యురాలి భర్తపై అనుమానం
కరీంనగర్, జులై 29: కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ అటవీశాఖ అధికారి అద్దె ఇంట్లో రూ.26 లక్షల నగదు చోరీకి గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో మాజీ జడ్పీటీసీ సభ్యురాలి భర్త ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తూ విచారణ చేపట్టినట్లు సమాచారం.
పోలీసుల వివరాల ప్రకారం, పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎక్లాస్‌పూర్‌కు చెందిన అటవీశాఖ అధికారి గుడిమల్ల శ్రీనివాస్ కరీంనగర్ జిల్లా తీగలగుట్ట మణికేశ్వర నగర్‌లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఇటీవల తన స్వగ్రామంలోని వ్యవసాయ భూమిని విక్రయించి వచ్చిన రూ.26 లక్షల నగదును ఇంట్లోని బెడ్‌రూమ్‌లో ఉన్న బీరువాలో భద్రపరిచినట్లు తెలిపారు.
కొంతకాలం తర్వాత డబ్బు అవసరం రావడంతో బీరువాను పరిశీలించగా తాళం ధ్వంసమై ఉండటంతో పాటు అందులో దాచిన రూ.26 లక్షలు కనిపించలేదు. గతంలో తన ఇంట్లో ల్యాప్‌టాప్ చోరీ జరిగిన ఘటనను గుర్తు చేసుకున్న బాధితుడు, అదే వ్యక్తి ఈ చోరీకి పాల్పడి ఉండవచ్చని అనుమానించాడు.
అలాగే, ఇటీవల తన ఇంటికి వచ్చిన మంథని మాజీ జడ్పీటీసీ సభ్యురాలి భర్త తగరం శంకర్‌లాల్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి, శంకర్‌లాల్‌ను మంగళవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ఈ చోరీలో మరెవరైనా ప్రమేయం ఉందా? నగదు పూర్తిగా స్వాధీనం చేసుకున్నారా? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
గమనిక: అధికారికంగా పోలీసులు వెల్లడించిన వివరాలు, దర్యాప్తు పూర్తయ్యే వరకు నిందితుడిపై వచ్చిన ఆరోపణలు మాత్రమే. కోర్టు దోషిగా తేల్చే వరకు ఎవరినీ నేరస్థుడిగా పరిగణించలేము.

Post a Comment