రోడ్ల దుస్థితిపై యువత వినూత్న నిరసన.. ప్రభుత్వ ఆస్పత్రి ముందు ఆందోళన
రోడ్ల దుస్థితిపై యువత వినూత్న నిరసన.. ప్రభుత్వ ఆస్పత్రి ముందు ఆందోళన
కరీంనగర్, జులై 30: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రహదారులు గుంతలమయంగా మారడంతో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు యువత, సామాజిక కార్యకర్తలు గురువారం వినూత్న నిరసన చేపట్టారు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే ప్రధాన రహదారిని వెంటనే మరమ్మతు చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త అన్నమల్ల సురేష్ మాట్లాడుతూ, గత కొన్నేళ్లుగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే రహదారి అత్యంత దయనీయంగా మారిందన్నారు. హార్ట్ పేషెంట్లు, గర్భిణీలు, అత్యవసర వైద్యం కోసం వచ్చే రోగులు ఈ రోడ్డుపై ప్రయాణించడం ప్రాణాపాయంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.
అలాగే, స్మార్ట్ సిటీ పేరుతో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పిన అధికారులు, ప్రజాప్రతినిధులు నగరంలోని రోడ్ల దుస్థితిని ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. "రూ.20 వేల కోట్ల స్మార్ట్ సిటీ నిధులు ఎక్కడ ఖర్చయ్యాయి?" అంటూ నిలదీశారు.
నగరంలోని అనేక రహదారులు అధ్వాన్నంగా ఉన్నప్పటికీ, అభివృద్ధి పేరుతో గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు కనిపించడం లేదని విమర్శించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఒకసారి నగరంలోని రోడ్లపై ప్రయాణిస్తే వాస్తవ పరిస్థితి అర్థమవుతుందని అన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించి ప్రభుత్వ ఆసుపత్రి రహదారితో పాటు నగరంలోని గుంతలమయమైన రోడ్లను తక్షణమే మరమ్మతు చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.

Post a Comment