పెళ్లి పేరుతో యువతిని మోసం.. గర్భం దాల్చించించి అబార్షన్‌లు.. మరో యువతితో నిశ్చితార్థం
పెళ్లి పేరుతో యువతిని మోసం.. గర్భం దాల్చించించి అబార్షన్‌లు.. మరో యువతితో నిశ్చితార్థం
మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో పెళ్లి పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలానికి చెందిన 34 ఏళ్ల యువతి ప్రస్తుతం బోడుప్పల్‌లోని మల్లికార్జున నగర్‌లో నివాసముంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. సుమారు ఎనిమిది నెలల క్రితం ఆమె ఓ మ్యాట్రిమొనీ వెబ్‌సైట్‌లో తన వివరాలను నమోదు చేయగా, ప్రవీణ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది.
పరిచయం క్రమంగా సాన్నిహిత్యంగా మారగా, తనకంటే వయసులో చిన్నవాడైనా పెళ్లి చేసుకుంటానని ప్రవీణ్ నమ్మించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఈ నమ్మకంతో ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడిందని, ఈ సమయంలో తాను రెండుసార్లు గర్భం దాల్చగా పెళ్లి చేస్తానంటూ నమ్మించి అబార్షన్ చేయించాడని ఆమె ఆరోపించింది.
ఇటీవల పెళ్లి విషయమై నిలదీయగా ప్రవీణ్ స్పందించడం మానేశాడని, అనంతరం అతడు మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలుసుకున్న బాధితురాలు మేడిపల్లి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Post a Comment