తాగునీటి వృథాపై జలమండలి కఠిన చర్యలు.. జూబ్లీహిల్స్‌లో రూ.5 వేల జరిమానా
తాగునీటి వృథాపై జలమండలి కఠిన చర్యలు.. జూబ్లీహిల్స్‌లో రూ.5 వేల జరిమానా
హైదరాబాద్: తాగునీటిని వృథా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ జలమండలి హెచ్చరించింది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్–33లోని ఓ భవనం వద్ద తాగునీటితో ప్రాంగణాన్ని శుభ్రం చేస్తూ నీటిని వృథా చేస్తున్నట్లు జలమండలి అధికారులు గుర్తించారు.
దీంతో జలమండలి ఓ అండ్ ఎం డివిజన్–6 అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి, సంబంధిత వినియోగదారుడికి రూ.5 వేల జరిమానా విధిస్తూ నోటీసు జారీ చేశారు. నోటీసు అందిన తేదీ నుంచి ఏడు రోజులలోపు జరిమానా మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించారు.
జలమండలి చట్టం–1989లోని సెక్షన్ 38, 39 ప్రకారం తాగునీటిని పొదుపుగా వినియోగించడం ప్రతి వినియోగదారుడి బాధ్యత అని అధికారులు తెలిపారు. నీటి దుర్వినియోగాన్ని గుర్తించేందుకు అధికారులు తనిఖీలు నిర్వహించే అధికారం చట్టం ద్వారా కల్పించబడిందని పేర్కొన్నారు.
అలాగే భవిష్యత్తులో మళ్లీ తాగునీటిని వృథా చేసినట్లు తేలితే సెక్షన్–42 ప్రకారం తాగునీరు, మురుగునీటి కనెక్షన్లను నిలిపివేయడంతో పాటు చట్టపరమైన తదుపరి చర్యలు కూడా తీసుకుంటామని జలమండలి హెచ్చరించింది.
తాగునీటిని వాహనాలు, రహదారులు, భవనాల ప్రాంగణాల శుభ్రత కోసం ఉపయోగించకుండా, అవసరమైన మేరకే వినియోగించి నీటిని పొదుపు చేయాలని జలమండలి ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

Post a Comment