తెలంగాణలో జేబీఎం ఎలక్ట్రిక్ బస్సుల సేవలు తాత్కాలికంగా నిలిపివేత.. టీజీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం
తెలంగాణలో జేబీఎం ఎలక్ట్రిక్ బస్సుల సేవలు తాత్కాలికంగా నిలిపివేత.. టీజీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం
హైదరాబాద్: తెలంగాణలో జేబీఎం (JBM) ఎలక్ట్రిక్ బస్సుల సేవలను టీజీఎస్‌ఆర్టీసీ (TGSRTC) తాత్కాలికంగా నిలిపివేసింది. ఇటీవల వరుసగా చోటుచేసుకున్న బ్యాటరీ సంబంధిత అగ్నిప్రమాదాల నేపథ్యంలో ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది.
ఇటీవల కరీంనగర్, వరంగల్ డిపోల పరిధిలో జేబీఎం ఎలక్ట్రిక్ బస్సుల్లో బ్యాటరీ లీకేజీలు, అగ్నిప్రమాదాలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగించింది. ఈ ఘటనలపై పూర్తి వివరాలు, సాంకేతిక విశ్లేషణ నివేదికలు, భద్రతపై స్పష్టమైన హామీ ఇవ్వాలని జేబీఎం సంస్థను టీజీఎస్‌ఆర్టీసీ కోరింది. అయితే ఇప్పటివరకు తగిన స్పందన రాకపోవడంతో బస్సుల సేవలను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది.
గత నెల జూన్ 21న కరీంనగర్ సమీపంలోని అలుగునూర్ వద్ద నడుస్తున్న ఎలక్ట్రిక్ బస్సులో అగ్నిప్రమాదం సంభవించింది. ఆ ఘటన మరువక ముందే, రెండు రోజుల క్రితం కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్‌లో నిలిపి ఉంచిన మరో జేబీఎం ఎలక్ట్రిక్ బస్సు బ్యాటరీ విభాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సిబ్బంది వెంటనే స్పందించి మంటలు ఇతర బస్సులకు వ్యాపించకుండా అదుపులోకి తీసుకురావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆ సమయంలో బస్సులో ప్రయాణికులు లేకపోవడం ఊరటనిచ్చింది.
ఈ వరుస ఘటనలను తీవ్రంగా పరిగణించిన టీజీఎస్‌ఆర్టీసీ, ప్రయాణికులు, సిబ్బంది మరియు ప్రజల భద్రతే తమకు అత్యంత ముఖ్యమని స్పష్టం చేసింది. జేబీఎం సంస్థ నుంచి ప్రమాదాల విశ్లేషణ నివేదిక, శాశ్వత నివారణ చర్యల ప్రణాళిక, బ్యాటరీల ఫిట్‌నెస్ సర్టిఫికేషన్, పూర్తి సాంకేతిక భద్రతా ధ్రువీకరణ అందిన తర్వాతే ఎలక్ట్రిక్ బస్సుల సేవలను తిరిగి ప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు.
ప్రస్తుతం జేబీఎం ఎలక్ట్రిక్ బస్సుల సేవలు నిలిపివేయబడగా, ప్రత్యామ్నాయంగా ఇతర బస్సులతో ప్రయాణికులకు సేవలు అందించేందుకు టీజీఎస్‌ఆర్టీసీ చర్యలు చేపడుతోంది. ప్రయాణికులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని అధికారులు తెలిపారు.

Post a Comment