పెళ్లి వేడుకకు వెళ్తుండగా ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి, పలువురికి తీవ్ర గాయాలు
పెళ్లి వేడుకకు వెళ్తుండగా ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి, పలువురికి తీవ్ర గాయాలు
అమరావతి, జూలై 3: ఆనందోత్సాహాల నడుమ జరగాల్సిన పెళ్లి వేడుక క్షణాల్లోనే విషాదంగా మారింది. మార్కాపురం జిల్లా కంభం వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
అనంతపురం జాతీయ రహదారిపై పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ఆటోను ఎదురుగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన వేగానికి ఆటో నుజ్జునుజ్జై, ప్రయాణికులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టి గాయపడిన వారిని అంబులెన్సుల ద్వారా కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పోలీసుల వివరాల ప్రకారం, మృతులు మరియు క్షతగాత్రులు ప్రకాశం జిల్లా గిద్దలూరు నల్లబండ బజారుకు చెందినవారు. నల్లబండ బజారుకు చెందిన వీరక్క వివాహం కంభంకు చెందిన పాములేటితో శుక్రవారం ఉదయం 9 గంటలకు జరగాల్సి ఉంది. వివాహ వేడుకకు వెళ్లే క్రమంలో కంభం వై జంక్షన్ వద్ద ఉన్న వినాయకుడి ఆలయంలో కొబ్బరికాయ కొట్టి పూజలు నిర్వహించేందుకు వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.
ఈ ప్రమాదంలో అలకనంద, అంకాలు, నాగేష్ సంఘటన స్థలంలోనే మృతి చెందగా, మరో వ్యక్తి కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తీవ్రంగా గాయపడిన ఏడాదిన్నర చిన్నారి నాగేశ్వరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. దీంతో మృతుల సంఖ్య ఐదుకు చేరింది.
గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషాద ఘటనతో పెళ్లి ఇంట్లో ఆనందం స్థానంలో తీవ్ర విషాదం అలుముకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

Post a Comment