చెట్టును ఢీకొట్టిన ఇసుక ట్రాక్టర్.. రెండుగా విడిపోయిన ఇంజిన్ భాగాలు

 

చెట్టును ఢీకొట్టిన ఇసుక ట్రాక్టర్.. రెండుగా విడిపోయిన ఇంజిన్ భాగాలు

చెట్టును ఢీకొట్టిన ఇసుక ట్రాక్టర్.. రెండుగా విడిపోయిన ఇంజిన్ భాగాలు

మహబూబాబాద్: మహబూబాబాద్ మండలం కేవులతండా సమీపంలో ఇసుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ శనివారం సాయంత్రం అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రతకు ట్రాక్టర్ ఇంజిన్ భాగం రెండుగా విడిపోగా, వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.

స్థానికుల సమాచారం మేరకు, చిన్నగూడూరు ప్రాంతం నుంచి మహబూబాబాద్ పట్టణానికి ఇసుకను తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ అధిక వేగంతో ప్రయాణించడం వల్లే అదుపు తప్పి ప్రమాదానికి గురైనట్లు స్థానికులు చెబుతున్నారు.

చిన్నగూడూరు–మహబూబాబాద్ మార్గంలో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లు అధిక వేగంతో సంచరిస్తుండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాణనష్టం సంభవించేలోపు అక్రమ ఇసుక రవాణాపై అధికారులు కఠిన చర్యలు తీసుకుని నియంత్రించాలని వారు డిమాండ్ చేశారు.

అలాగే, పలు ప్రాంతాల్లో విచ్చలవిడిగా ఇసుక కుప్పలు కనిపిస్తున్నప్పటికీ రెవెన్యూ అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. అక్రమ ఇసుక రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కట్టడి చేయాలని వారు కోరుతున్నారు

Blogger ఆధారితం.