సింగరేణిలో అత్యాధునిక జియో సైన్స్ లేబరేటరీ ప్రారంభం
సింగరేణిలో అత్యాధునిక జియో సైన్స్ లేబరేటరీ ప్రారంభం
భూగర్భ పరిశోధనలు, ఖనిజాల విశ్లేషణలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
కొత్తగూడెం, జూలై 23: సింగరేణి సంస్థలో భూగర్భ శాస్త్ర పరిశోధనలు, ఖనిజాల విశ్లేషణను మరింత ఆధునికీకరించే దిశగా కీలక ముందడుగు పడింది. కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాలో ఏర్పాటు చేసిన అత్యాధునిక జియో సైన్స్ లేబరేటరీని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు గురువారం ఘనంగా ప్రారంభించారు.
జిల్లా పర్యటనలో భాగంగా కొత్తగూడెంకు చేరుకున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు జిల్లా కలెక్టర్ అంకిత్ పూల మొక్క అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం జియో సైన్స్ లేబరేటరీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆధునిక సదుపాయాలను పరిశీలించారు.
లేబరేటరీలో ఏర్పాటు చేసిన అత్యాధునిక యంత్ర పరికరాలు, ఖనిజాల నమూనాల విశ్లేషణ విధానాలు, బొగ్గు నాణ్యత నిర్ధారణ ప్రక్రియలు, భూగర్భ శాస్త్ర పరిశోధనలకు వినియోగిస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉప ముఖ్యమంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా లేబరేటరీలో అమలు చేస్తున్న పరీక్షా విధానాలు, విశ్లేషణ సామర్థ్యం, పరిశోధనల ప్రాముఖ్యతపై సింగరేణి అధికారులు ఆయనకు వివరించారు.
అధికారులు మాట్లాడుతూ, ఈ జియో సైన్స్ లేబరేటరీ ద్వారా ఖనిజాల నమూనాల విశ్లేషణ, బొగ్గు నాణ్యత నిర్ధారణ, భూగర్భ శాస్త్ర పరిశోధనలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరింత వేగవంతంగా, కచ్చితత్వంతో నిర్వహించే అవకాశం లభిస్తుందని తెలిపారు. దీంతో సింగరేణిలో శాస్త్రీయ పరిశోధనలకు మరింత ప్రోత్సాహం లభించడంతో పాటు ఆధునిక గనుల నిర్వహణకు అవసరమైన సాంకేతిక సేవలు మరింత మెరుగుపడతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, సింగరేణి చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ బుద్ధ ప్రకాశ్ జ్యోతి, ఐఏఎస్, సింగరేణి డైరెక్టర్ (పర్సనల్, అడ్మినిస్ట్రేషన్ అండ్ వెల్ఫేర్) గౌతమ్ పొట్రూ, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్, సింగరేణి ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment