మక్కా పర్యటనకు బయలుదేరిన మౌలానా రఫీఖ్ ఖాస్మీ సాహెబ్‌కు ఘన సన్మానం
ఉమ్రా ఆధ్యాత్మిక శుద్ధికి, అల్లాహ్ కృపకు మార్గం
మక్కా పర్యటనకు బయలుదేరిన మౌలానా రఫీఖ్ ఖాస్మీ సాహెబ్‌కు ఘన సన్మానం
గోదావరిఖని, జూలై 14: జామియా మసీదు నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో 8 ఇన్‌క్లైన్ కాలనీలోని జామియా మస్జిద్‌లో "ఉమ్రా ఎందుకు చేయాలి?" అనే అంశంపై ఆధ్యాత్మిక సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్రా యాత్ర నిమిత్తం మక్కా పర్యటనకు బయలుదేరుతున్న జామియా మస్జిద్ ఇమామ్, ఖతీబ్ మౌలానా రఫీఖ్ ఖాస్మీ సాహెబ్‌కు శాలువాలు, తువ్వాళ్లతో ఘన సన్మానం చేసి, ప్రత్యేక దుఆలతో వీడ్కోలు పలికారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి, ప్రధాన వక్తగా పాల్గొన్న ఖాజీ మొహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ మాట్లాడుతూ, ఉమ్రా ఇస్లాంలో అత్యంత పవిత్రమైన ఆరాధనలలో ఒకటని, దీనిని "చిన్న హజ్" అని కూడా పిలుస్తారని తెలిపారు. ఉమ్రా ఫర్జ్ కాకపోయినా, దానిని ఆచరించడం ద్వారా అల్లాహ్ క్షమాభిక్ష, అపారమైన సవాబ్, జీవనోపాధి (రిజ్క్)లో మరియు ఆయుష్షులో బరకత్ లభిస్తాయని హదీస్‌ల ఆధారంగా వివరించారు.
ప్రవక్త హజ్రత్ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి హదీస్‌లను ఉటంకిస్తూ, ఒక ఉమ్రా నుంచి మరో ఉమ్రా వరకు జరిగిన చిన్న పాపాలను అల్లాహ్ క్షమిస్తాడని, హజ్ మరియు ఉమ్రాను తరచుగా చేయడం వల్ల పేదరికం, పాపాలు తొలగిపోతాయని పేర్కొన్నారు. అలాగే హజ్, ఉమ్రా యాత్రికులు అల్లాహ్ అతిథులని, వారికి లభించే గౌరవం ఎంతో గొప్పదని చెప్పారు.
కాబా దర్శనం, సఫా-మర్వా కొండల మధ్య సయీ ద్వారా కలిగే ఆధ్యాత్మిక అనుభూతి, మనశ్శాంతిని వివరిస్తూ, ఉమ్రా ప్రవక్తల సున్నత్ అని, అవకాశం ఉన్న ప్రతి ముస్లిం ఈ పవిత్ర యాత్రను జీవితంలో కనీసం ఒక్కసారైనా చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమం హఫీజ్ అహ్మద్ మొహియుద్దీన్ ఖుర్‌ఆన్ పారాయణంతో ప్రారంభమైంది. అనంతరం మౌలానా రఫీఖ్ ఖాస్మీ సాహెబ్ విజయవంతమైన ఉమ్రా యాత్ర పూర్తి చేసి క్షేమంగా తిరిగి రావాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జామియా మసీదు నిర్వహణ కమిటీ అధ్యక్షుడు అయాజుద్దీన్, మాజీ అధ్యక్షుడు సయ్యద్ ఫహీమ్, జమాత్-ఎ-ఇస్లామీ హింద్ గోదావరిఖని అధ్యక్షుడు సయ్యద్ జావీద్ అక్మల్ హుస్సైనీ, జమాత్-ఎ-ఇస్లామీ హింద్ ప్రతినిధులు, 8 ఇన్‌క్లైన్ కాలనీ జామియా మస్జిద్ నిర్వహణ కమిటీ సభ్యులు, స్థానిక ప్రముఖులు, పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

Post a Comment