హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. రోడ్లన్నీ జలమయం, భారీ ట్రాఫిక్ జామ్
హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. రోడ్లన్నీ జలమయం, భారీ ట్రాఫిక్ జామ్
హైదరాబాద్ నగరంలో శుక్రవారం రాత్రి కుండపోత వర్షం కురవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ వర్షం కారణంగా నగరంలోని ప్రధాన రహదారులపై వర్షపు నీరు నిలిచిపోవడంతో పలుచోట్ల తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. కార్యాలయాల నుంచి ఇళ్లకు బయలుదేరిన ఉద్యోగులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు.
ముఖ్యంగా మణికొండ, గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, బేగంపేట్, సికింద్రాబాద్, అంబర్‌పేట్, కాచిగూడ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అలాగే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, ఖైరతాబాద్, లక్డీకపూల్, నాంపల్లి, కోఠి ప్రాంతాల్లోనూ వర్షం దంచికొట్టింది. పలు లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఇదిలా ఉండగా, గత రెండు మూడు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గోదావరిలోకి భారీగా వరద నీరు చేరడంతో భద్రాచలం వద్ద అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. రాష్ట్రంలోని పలు జలాశయాలు పూర్తిస్థాయికి చేరుకోవడంతో ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
హైదరాబాద్‌లోనూ వరుసగా మూడో రోజూ వర్షాలు కొనసాగుతుండటంతో ట్రాఫిక్ ఇబ్బందులు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఐటీ కంపెనీలు, ఇతర సంస్థలు సాధ్యమైనంత వరకు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం కల్పించాలని పోలీసులు సూచించారు. అలాగే కార్యాలయాల పని వేళలను సర్దుబాటు చేసి, సాయంత్రం ఒకేసారి భారీగా ఉద్యోగులు రోడ్లపైకి రాకుండా చర్యలు తీసుకోవాలని కంపెనీలను కోరారు.
అత్యవసర అవసరం లేకుంటే ప్రజలు బయటకు రావద్దని, నీరు నిలిచిన ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Post a Comment