దుప్పి మాంసం కేసులో ఇద్దరికి ఏడాది జైలు శిక్ష.. ఏడుగురికి విముక్తి

 

దుప్పి మాంసం కేసులో ఇద్దరికి ఏడాది జైలు శిక్ష.. ఏడుగురికి విముక్తి

దుప్పి మాంసం కేసులో ఇద్దరికి ఏడాది జైలు శిక్ష.. ఏడుగురికి విముక్తి

కొత్తగూడెం: దుప్పి మాంసం కలిగి ఉన్న కేసులో ఇద్దరు నిందితులకు ఏడాది జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ కొత్తగూడెం మొదటి అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కె. సాయి శ్రీ బుధవారం తీర్పు వెలువరించారు.

ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. 2021 జూలై 16 రాత్రి ములకలపల్లి మండలం చాపరాపల్లి శివారు చెరువు వద్ద ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఏ. మల్లికార్జున్ రావు తనిఖీలు నిర్వహిస్తుండగా దుప్పి మాంసంతో కొందరు వ్యక్తులు కనిపించారు. అధికారులను గమనించిన వెంటనే వారిలో పలువురు పరారయ్యారు. అనంతరం తన్నీరు లోకేష్, పసుపులేటి నాగేంద్రబాబులను అదుపులోకి తీసుకుని విచారించగా, మరికొందరి పేర్లు వెల్లడించారు.

దీంతో అప్పటి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పి. రవికిరణ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా ఐదుగురు సాక్షులను కోర్టు పరిశీలించింది.

విచారణ అనంతరం రామచంద్రపురానికి చెందిన జబ్బూరి నాగేశ్వరరావు, కంచు భూషయ్యలపై అభియోగాలు రుజువయ్యాయని కోర్టు నిర్ధారించింది. దీంతో ఇద్దరికీ ఒక్కో ఏడాది జైలు శిక్షతో పాటు రూ.5,000 చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది.

అయితే ఇదే కేసులో నిందితులుగా ఉన్న మిగతా ఏడుగురిపై అభియోగాలు రుజువు కాకపోవడంతో వారిని కోర్టు నిర్దోషులుగా ప్రకటిస్తూ కేసును కొట్టివేసింది.

ఈ కేసులో ప్రభుత్వ తరఫున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) అనిల్ కుమార్ వాదనలు వినిపించగా, ఫారెస్ట్ అధికారులు ముత్తయ్య, కల్పన దర్యాప్తు, విచారణలో సహకరించారు.

Blogger ఆధారితం.