TRS పార్టీ అధ్యక్షురాలు కవిత అరెస్ట్.. బోడుప్పల్ భూ పోరాటం ఉద్రిక్తం
TRS పార్టీ అధ్యక్షురాలు కవిత అరెస్ట్.. బోడుప్పల్ భూ పోరాటం ఉద్రిక్తం
హైదరాబాద్, జులై 2 (కలం నిఘా): తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను గురువారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. బోడుప్పల్‌లో తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన భూ పోరాట కార్యక్రమంలో పాల్గొన్న ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు కవితను బలవంతంగా తీసుకెళ్లడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆమెతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలను కూడా అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
అరెస్ట్ అనంతరం బొల్లారం పోలీస్ స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడిన కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, వారి హక్కుల కోసం పోరాడుతున్న నాయకులను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆమె అన్నారు.
మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం దారుణమని, ప్రభుత్వ ఆదేశాలతోనే ఈ చర్యలు జరిగాయని ఆరోపించారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి విచక్షణారహితంగా లాఠీలతో కొట్టారని, పలువురికి గాయాలయ్యాయని ఆమె పేర్కొన్నారు.
ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుండగా, పోలీసులు మాత్రం శాంతిభద్రతల పరిరక్షణ కోసమే చర్యలు తీసుకున్నట్లు సమాచారం.

Post a Comment