హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం.. ట్రాఫిక్ టోటల్ జామ్..!
హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం.. ట్రాఫిక్ టోటల్ జామ్..!
హైదరాబాద్, ఆగస్టు 4: నగరాన్ని మంగళవారం మధ్యాహ్నం నుంచి కురుస్తున్న భారీ వర్షం అతలాకుతలం చేసింది. సాయంత్రం నుంచి వర్షం మరింత ఉధృతం కావడంతో ప్రధాన రహదారులు జలమయమై, నగరవ్యాప్తంగా ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించింది.
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, మెహిదీపట్నం, కొండాపూర్, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, బేగంపేట, అమీర్‌పేట్, ఎస్‌ఆర్ నగర్, పంజాగుట్ట, ఎల్బీనగర్, చందానగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో రహదారులపై మోకాళ్ల లోతు వరకు నీరు నిలిచింది.
ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో వాహనాలు గంటల తరబడి నిలిచిపోవడంతో ఉద్యోగులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలుచోట్ల ట్రాఫిక్ కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం రాత్రి వరకు భారీ వర్షాలు కొనసాగనున్నాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, వీలైనంత వరకు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు సూచించారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నీరు నిలిచిన రహదారులపై ప్రయాణించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరించారు. మరోవైపు డీఆర్‌ఎఫ్ (DRF) బృందాలు రంగంలోకి దిగి నీటి నిల్వలను తొలగిస్తూ సహాయక చర్యలు చేపడుతున్నాయి.

Post a Comment