జగిత్యాల జిల్లాలో విషాదం.. కుంటలో మునిగి ఇద్దరు విద్యార్థులు మృతి
జగిత్యాల జిల్లాలో విషాదం.. కుంటలో మునిగి ఇద్దరు విద్యార్థులు మృతి
జగిత్యాల జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. మల్యాల మండలంలోని ఎస్సీ హాస్టల్‌లో ఉంటున్న ఇద్దరు విద్యార్థులు కుంటలో మునిగి మృతి చెందారు. సోమవారం (ఆగస్టు 3) జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
మృతులు వాసం విష్ణు (స్వస్థలం: నిజామాబాద్ జిల్లా మోర్తాడ్) మరియు శుశాంత్ (స్వస్థలం: జగిత్యాల టీఆర్ నగర్)గా గుర్తించారు. వీరిద్దరూ మల్యాల మండల పరిషత్ పాఠశాలలో చదువుతున్నారు. ఈత కొట్టేందుకు కుంటకు వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి ఘటనపై విచారణ చేపట్టారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో మృతుల కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే సంజయ్ కుమార్, డీఎస్పీ పరామర్శించారు. అయితే, అధికారులు మృతదేహాలను తీసుకెళ్లాలని సూచించినప్పటికీ కుటుంబ సభ్యులు నిరాకరించారు. విద్యార్థుల మృతికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించాలని, ఘటనపై సమగ్ర విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు.
మంత్రి వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు మృతదేహాలను తీసుకెళ్లబోమని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇదిలా ఉండగా, ఘటనతో ఆందోళన చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు పెద్దఎత్తున మల్యాల ఎస్సీ హాస్టల్‌కు చేరుకుని తమ పిల్లలను హాస్టల్ నుంచి తీసుకెళ్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి.

Post a Comment