తమిళనాడు మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్.. రాజకీయాల్లో కలకలం
తమిళనాడు మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్.. రాజకీయాల్లో కలకలం
హైదరాబాద్, ఆగస్టు 4: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఉప ముఖ్యమంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. డీఎంకే పార్టీ కార్యక్రమంలో సీఎం విజయ్, నటి త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో తంజావూరు పోలీస్ స్టేషన్‌లో ఆయనపై ఆరు సెక్షన్ల కింద కేసు నమోదైంది.
కేసు నమోదు అనంతరం ఉదయం భారీ పోలీసు బలగాలు ఉదయనిధి నివాసానికి చేరుకుని ఆయనను అదుపులోకి తీసుకున్నాయి. ఈ సందర్భంగా డీఎంకే నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఉదయనిధిని పోలీసులు తరలిస్తుండగా డీఎంకే కార్యకర్తలు పోలీసు వాహనాలను అడ్డుకుని విజయ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకోగా, పోలీసులు వారిని చెదరగొట్టి ఉదయనిధిని అక్కడి నుంచి తరలించారు.
అరెస్టు అనంతరం ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ, "నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఎవరి పేరును ప్రత్యక్షంగా ప్రస్తావించలేదు. ఈ కేసును న్యాయపరంగా ఎదుర్కొంటాను" అని తెలిపారు.
ఇదిలా ఉండగా, ఉదయనిధి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని సీఎం విజయ్, త్రిషలకు క్షమాపణ చెప్పాలని టీవీకే నేతలు డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ఉదయనిధి స్టాలిన్ ఇప్పటికే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై మంగళవారం మధ్యాహ్నం విచారణ జరగనుంది.

Post a Comment