శ్రీ రామలింగేశ్వర స్వామి, పార్వతీదేవి ఉపాలయాల ప్రతిష్టా మహోత్సవం
కొత్తగూడెంలో ఘనంగా శ్రీ రామలింగేశ్వర స్వామి, పార్వతీదేవి ఉపాలయాల ప్రతిష్టా మహోత్సవం
కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మండలం, పట్టణంలోని శ్రీ పాండురంగ భజన మందిరం ప్రాంగణంలో శ్రీ రామలింగేశ్వర స్వామివారు, శ్రీ పార్వతీదేవి అమ్మవార్ల ఉపాలయాల ప్రతిష్టా మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా ముగిశాయి. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు ఐదు రోజులపాటు పాంచాహ్నిక దీక్షాపూర్వక కార్యక్రమాలు నిర్వహించారు.
ఆదివారం ఐదవ రోజు, చివరి రోజు కార్యక్రమాల్లో భాగంగా ఉదయం 6 గంటలకు మంగళ వాయిద్యాలతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం ఉదయం 8.30 గంటల నుంచి ప్రాతఃకాల అర్చనలు, అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. ఉదయం 10.30 గంటలకు మూర్తుల స్థానములు, గర్తన్యాసం, బీజ, ఓషధి, రత్నన్యాస కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
అనంతరం ఉదయం 11.25 గంటలకు మూలా నక్షత్ర యుక్త తులా లగ్నంలో యంత్ర, విగ్రహ స్థిర ప్రతిష్ట కార్యక్రమాన్ని వేదమంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.
మధ్యాహ్నం 12 గంటలకు భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. మధ్యాహ్నం 1 గంటకు శాంతి కల్యాణం నిర్వహించిన అనంతరం బలిహరణ, ధేను దర్శనం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం, ఆశీర్వచనం కల్పించారు.
ఈ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలను బ్రహ్మర్షి శ్రీ చేబ్రోలు సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలోని బృందం శాస్త్రోక్తంగా నిర్వహించింది. ఐదు రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమాల్లో ఆలయ కార్యనిర్వహణాధికారి కె. సులోచన, ఆలయ అర్చకులు, సిబ్బంది, ఆలయ నిర్మాణ దాతలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
శ్రీ రామలింగేశ్వర స్వామివారు, శ్రీ పార్వతీదేవి అమ్మవార్ల ఉపాలయాల ప్రతిష్టా మహోత్సవాలు విజయవంతంగా పూర్తికావడంతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. భక్తులు స్వామివార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

Post a Comment