ఆసియా కప్ విజేతగా భారత్.. సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
హైదరాబాద్: ఆసియా కప్ 2025లో విజేతగా నిలిచిన భారత క్రికెట్ జట్టుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగి చివరి బంతి వరకు సస్పెన్స్ కలిగించిందని ఆయన పేర్కొన్నారు. టీమ్ ఇండియా జట్టు సమష్టిగా పోరాడి ఈ అద్భుత విజయాన్ని సాధించిందని ప్రశంసించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. “ఆసియా కప్ ఫైనల్‌లో భారత ఆటగాళ్లు ప్రదర్శించిన క్రీడాస్ఫూర్తి, కట్టుదిట్టమైన వ్యూహం ప్రతి భారతీయుడి గుండెల్లో గర్వాన్ని నింపింది. ముఖ్యంగా మన తెలంగాణ సంతతి తిలక్ వర్మ ఈ విజయానికి కీలకంగా నిలిచి జట్టులో తన ప్రతిభను చాటాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో తిలక్ వర్మ ప్రదర్శన రాష్ట్రానికి గొప్ప పేరు, గౌరవం తీసుకొచ్చింది” అని తెలిపారు.
అదే విధంగా, క్రీడల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ క్రీడాకారులకు అండగా ఉంటుందని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. భారత జట్టు సాధించిన ఈ విజయాన్ని ఆయన “దేశానికి మరో గౌరవకరమైన ఘట్టం”గా అభివర్ణించారు.
Post a Comment