జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్ : జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
అక్టోబర్ 13 నుంచి 21 వరకు (ప్రభుత్వ సెలవు దినాలు మినహా) నామినేషన్లను స్వీకరించనున్నారు. అభ్యర్థులు తమ నామినేషన్లను షేక్‌పేట్ ఎమ్మార్వో కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ ఆఫీసులో సమర్పించాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.
నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 22న జరగనుంది. అలాగే అక్టోబర్ 24వ తేదీ సాయంత్రం వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. అదే రోజు అభ్యర్థుల తుది జాబితా ప్రకటించబడుతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నవంబర్ 11న నిర్వహించబడనుండగా, నవంబర్ 14న యూసఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో లెక్కింపు ప్రక్రియ జరిపి ఫలితాలను అదే రోజు ప్రకటించనున్నారు.
ఎన్నికల ప్రక్రియలో భాగంగా https://encore.eci.gov.in పోర్టల్ ద్వారా డిజిటల్ నామినేషన్ సమర్పించే అవకాశం కూడా కల్పించబడింది. అయితే అభ్యర్థులు క్యూఆర్ కోడ్‌తో కూడిన ప్రింటెడ్ హార్డ్‌కాపీని తప్పనిసరిగా సమర్పించాలని అధికారులు స్పష్టం చేశారు. నామినేషన్ ఫీజు ఆన్‌లైన్‌లో బ్యాంక్ లేదా ట్రెజరీలో క్రెడిట్ అయి ఉండాలి; లేకపోతే మాన్యువల్‌గా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణంతో ఏర్పడిన ఈ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. అన్ని రాజకీయ పార్టీలు ఈ సీటు గెలుచుకోవడానికి వ్యూహ ప్రతివ్యూహాలతో సిద్ధమవుతున్నాయి.

Post a Comment