మేడారం అభివృద్ధి పనులు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయి: మంత్రి సీతక్క

మేడారం అభివృద్ధి పనులు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయి: మంత్రి సీతక్క


ములుగు, అక్టోబర్ 12: మేడారం సమ్మక్క–సారలమ్మ తల్లులకు ముక్కులు చెల్లించుకున్న అనంతరం మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడారు.

మంత్రి సీతక్క మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో మేడారం ఆలయ అభివృద్ధి పనులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని తెలిపారు. గద్దెల ప్రాంగణ విస్తరణతో పాటు ఆలయ పునరుద్ధరణ పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు. భక్తులకు మరింత సౌకర్యం కల్పించాలన్న ఉద్దేశ్యంతో సీఎం యుద్ధప్రాతిపదికన పనులు చేయిస్తున్నారని ఆమె పేర్కొన్నారు.

వారం రోజుల క్రితమే అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయని, ఇప్పటికే జాతర రాకముందే వేలాది మంది భక్తులు దర్శనార్థం వస్తున్నారని తెలిపారు. “తల్లుల మీద భక్తుల విశ్వాసం రోజు రోజుకీ పెరుగుతోంది. దాంతో మేడారం మహా జాతర ఏర్పాట్లు కూడా ప్రారంభమయ్యాయి. భక్తులకు అసౌకర్యం కలగకుండా శాశ్వత అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నాం” అని మంత్రి సీతక్క తెలిపారు.

తాను ఆలయ అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యురాలిగా ఉండటం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్‌చార్జ్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎండోమెంట్స్ మినిస్టర్ సురేఖ, ట్రైబల్ మినిస్టర్ అడ్లూరి లక్ష్మణ్‌లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

“ప్రతి దశలో పూజారులను సంప్రదిస్తూ పనులు సాగిస్తున్నాం. మేడారం చరిత్ర, ఆదివాసుల త్యాగాలు, పూజారుల వంశ పరంపరలను భవిష్యత్తు తరాలకు అందించేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం” అని మంత్రి తెలిపారు.

“నాకు జన్మనిచ్చింది సమ్మక్క సమ్మయ్య, కానీ పునర్జన్మ ఇచ్చింది సమ్మక్క–సారలమ్మ, పగిడిద్ద గోవిందరాజులు. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది ములుగు ప్రజలే. అందుకే తల్లుల సేవలో, ప్రజాసేవలో ఎల్లప్పుడూ ఉంటాను. ఎవరు ఏమి విమర్శించినా వెయ్యేండ్లు నిలిచేలా మేడారాన్ని అభివృద్ధి చేస్తాం” అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.


కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.