క్యూనెట్‌ స్కామ్‌లో డబ్బు కోల్పోయి యువకుడు ఆత్మహత్య

క్యూనెట్‌ స్కామ్‌లో డబ్బు కోల్పోయి యువకుడు ఆత్మహత్య


ఇద్దరు నిందితులు అరెస్టు – కమీషనర్ హెచ్చరిక: “QNET వంటి స్కీమ్స్ ఆర్థిక ఉచ్చులు” సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వెల్లూరు గ్రామానికి చెందిన 26 ఏళ్ల హరికృష్ణ క్యూనెట్‌ నెట్‌వర్క్‌ స్కామ్‌లో రూ.8 లక్షలు కోల్పోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.

పోలీస్ కమిషనర్ ఎస్‌.ఎం. విజయ్ కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం – హరికృష్ణ తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని నమ్మబలికిన కల్వల మణికంఠరెడ్డి (23), ఉప్పలపు అలేఖ్య (25) అనే ఇద్దరు యువకులు అతన్ని QNET‌లోకి చేర్చారు.

జూలైలో సికింద్రాబాద్‌ ట్యాంక్‌ బండ్‌ సమీపంలోని హోటల్‌లో జరిగిన సమావేశంలో హరికృష్ణ ₹4 లక్షలు చెల్లించి సభ్యత్వం పొందాడు. ప్రతిగా ‘ట్రిప్‌ సేవర్‌’ కూపన్‌, ఒక గడియారం అందుకున్నాడు. తరువాత అనేక సెమినార్లకు హాజరైన అతను ఈ వ్యాపారం నిజానికి పిరమిడ్ స్కీమ్ అని, కొత్త సభ్యులను చేర్చకపోతే లాభాలు సాధ్యంకాదని గ్రహించాడు.

ఆర్థిక ఒత్తిడి, మానసిక వేదనను తట్టుకోలేక 2025 అక్టోబర్‌ 9న తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటన స్థలంలో సూసైడ్‌ నోట్‌ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇద్దరు నిందితులు రిమాండ్‌లో

ఈ కేసులో మణికంఠరెడ్డి, అలేఖ్యలను అరెస్టు చేసి జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించారు. మరికొందరు నిందితులపై గాలింపు కొనసాగుతోందని కమిషనర్ తెలిపారు.

“క్యూనెట్‌ ఒక ఆర్థిక మహమ్మారి” – కమిషనర్‌

“QNET, ఇలాంటి మనీ సర్క్యులేషన్‌ నెట్‌వర్క్‌లు పూర్తిగా మోసపూరితమైనవి. లాభాల పేరుతో మోసం చేస్తాయి, చివరికి నిరాశ మాత్రమే మిగులుతుంది,” అని విజయ్ కుమార్ హెచ్చరించారు.
ప్రజలు ఆన్‌లైన్‌ పెట్టుబడులు, బెట్టింగ్‌ యాప్‌లు, త్వరగా ధనవంతులు అవ్వాలనే పథకాల బారిన పడవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

అనుమానాస్పద కార్యకలాపాలను సైబర్‌ హెల్ప్‌లైన్‌ 1930, డయల్‌ 100 లేదా సిద్దిపేట పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ 8712667100 ద్వారా సమాచారం ఇవ్వాలని సూచించారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.